శోభన్ బాబు వర్ధంతి స్పెషల్

సోగ్గాడు అనే పదానికి అసలు అర్ధంలా భావించే శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కృష్ణా జిల్లా చిన నందిగామలో ఉప్పు సూర్యనారాయణ రావు కుమారుడైన శోభన్ బాబు మైలవరం స్కూల్ లో చదివే రోజుల్లో నాటకాలపై ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందారు. గుంటూరు ఏసీ కాలేజీలో ‘పునర్జన్మ’ వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. హైస్కూలు చదువు పూర్తయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేశారు. శోభన్ బాబు నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. మనుషులు మారాలి.. యావత్ తెలుగు సినీ అభిమానులు ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది. ఇక అప్పటికే అందాల నటుడిగా ఆంధ్ర లోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో చెల్లెలి కాపురం చిత్రం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం. ఇక ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రంలో తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం. ఇలా చెప్పుకుంటే పోతే ఒక్కటా రెండా 220కి పైగా చిత్రాలలో నటించి 1996లో విడుదలైన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు. శోభన్ బాబు 2008, మార్చి 20న ఉదయం 10 గంటల 50 నిమిషాలకు చెన్నైలో కాలం చేశారు. ఇక అలా అయన మనకు దూరమై 14 ఏళ్ళు అవుతున్నాయి. ఇక ఆయన 14వ వర్ధంతి సందర్భంగా అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి నివాళులు అర్పించింది అనుక్షణం మిమ్ములనే స్మరిస్తూ… మీరు చూపిన బాటలోనే పయనిస్తూ ఉంటామని ఆయన అభిమానులు, అఖిలభారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, బి.బాలసుబ్రహ్మణ్యం, పూడి వెంకట శ్రీనివాసరావు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, రాంబాబు, రామరాజు, సాయి కామరాజు, జవహర్ బాబు, టి.వీరప్రసాద్, విజయ్, డా. ధారా సత్యనారాయణ, యస్.యన్.రావు శోభన్ బాబును స్మరించుకున్నారు.