దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం మళ్ళీ మొదలయింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో నటుడు విజయ్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఒకరకంగా పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికి మళ్ళీ అదే కారణమైంది. హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం విజయ్, ప్రశాంత్ కిషోర్ రహస్యంగా సమావేశమై రాజకీయ చర్చలు సాగించడం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై విజయ్ సన్నిహితుడు మాట్లాడుతూ ‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడింది కానీ బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోంది. కరుణానిధిపై ధ్వేషం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ భవిష్యత్తు ఏంటోనని అన్నాడీఎంకే నేతలు కలత చెందుతున్నారు. కానీ డీఎంకేలో చేరేందుకు వారు ఇష్టపడటం లేదు. బీజేపీతో పొత్తు వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ పార్టీ పెడితే అన్నాడీఎంకే శ్రేణులు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాజకీయ ప్రచారం మొదలైంది. నిజానికి రాజకీయాల్లోకి రావాలని విజయ్‌కు ఎంతోకాలంగా బలమైన కోరిక ఉంది. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కూడా ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే ‘ ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయడం, అనుకోని కారణాలతో విజయ్ ఒత్తిడితో ఉపసంహరించడం కూడా జరిగిపోయింది. కానీ ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్ మక్కల్ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. వారందరినీ విజయ్ ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగారు. ఈ దెబ్బతోనే ఆయనకు క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశలు తలెత్తాయని అంటున్నారు.