థియేటర్‌ యజమానులను బెదిరిస్తున్నారు: నిర్మాతల ఆగ్రహం

7 8

సినిమా థియేటర్‌ యజమానులను బెదిరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ ఉద్యోగులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని నిర్మాతలు నట్టికుమార్, ఏలూరు సురేందర్ రెడ్డి ఆరోపించారు. ‘భీమ్లానాయక్‌’ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో రద్దైన జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయించాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్‌‌తో కలిసి మీడియాతో మాట్లాడిన నిర్మాతలు నట్టి కుమార్‌, సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన జీవో ప్రకారం టికెట్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో పలువురు రాజకీయ నాయకులు కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకుని రద్దైన జీవో 35 కంటే ముందున్న జీవో 100 ప్రకారమే టికెట్‌ ధరలు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నటీనటులకు వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నా.. సినిమా వరకు వచ్చే సరికి సినిమానే ప్రాధాన్యత ఉంటుందని ప్రసన్నకుమార్‌ తెలిపారు.