‘గంగూబాయి కతియావాడి’కి తొలగిన అడ్డంకులు

సంజయ్ లీలా భన్సాలీ సినిమా వచ్చినప్పుడల్లా కోర్టు కేసులు సర్వసాధారణం. ఇక శుక్రవారం విడుదల కాబోతున్న ‘గంగూబాయి కతియావాడి’కి కూడా అనేక కేసులు ఎదుర్కొంటున్నారు భన్సాలీ. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఇప్పుడు ఉపశమనం లభించింది. గంగూబాయి దత్తపుత్రుడు గంగూబాయిని చెడుగా చిత్రీకరించారని పేర్కొంటూ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చిత్రం టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదలపై స్టే విధించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై విచారించిన.. ధర్మాసనం సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే టైటిల్ మార్చే అవకాశం ఉంటే చూడాలని సూచించింది. సినిమా విడుదల చివరి క్షణంలో పేరు మార్చడం కుదరదని నిర్మాత పేర్కొనగా.. ముందే నిర్ణయించిన ప్రకారం సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఇక సినిమా విడుదల తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.