నమ్రత బర్త్ డే స్పెషల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ 1972 జనవరి 22న జన్మించారు. చదువు తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె 1993లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నమ్రత తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 2000 మహేశ్ బాబు నటించిన వంశీ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మహేష్ బాబు కంటే నమ్రత 4ఏళ్ళు పెద్ద. అయితే అది వారి పవిత్ర ప్రేమకు అడ్డుకాలేదు. 2005లో అతడు సినిమా షూటింగ్ సమయంలో ఫిబ్రవరి 10న ముంబైలో మహేశ్-నమ్రతల వివాహం జరిగింది. వీరిద్దరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మహేశ్ బాబు ప్రిన్స్ నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను అందుకున్నారు. అయితే మహేష్ సినీ లైఫ్‌లో ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. నిజానికి మహేష్ బాబుకు నమ్రత కేవలం భార్యగానే కాకుండా పర్సనల్ అడ్వైజర్‌గా ఎన్నో సలహాలు ఇస్తుంటారు. ఒకవిధంగా మహేష్ నేషనల్ లెవెల్లో యాడ్స్ చేయడానికి ముఖ్య కారణం అలాగే ప్రొడక్షన్ హౌజ్‌ను స్థాపించడానికి కారణం కూడా నమ్రతే. ఇంటి వ్యవహరాలతో పాటు బిజినెస్ వ్యవహారాలు కూడా ఎంతో తెలివిగా మ్యానేజ్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే సామెతకు నమ్రత అతికినట్టు సరిపోతారు. మహేశ్ బాబు కూడా ఎన్నో సార్లు విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు. తన శ్రీమతి కుటుంబ వ్యవహారాలతో పాటు వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు.

ఇక ఈ దంపతులిద్దరూ తమ పిల్లలైన గౌతమ్, సితారాతో కలిసి వెకేషన్‌కు వెళ్తుంటారు. ఎక్కువగా కుటుంబంతో సమయాన్ని గడిపే మహేష్ వీలైనంత వరకు ప్రయివేట్ పార్టీలకు దూరంగానే ఉంటారు. కాస్త టైమ్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. వీటన్నింటినీ షెడ్యూల్ ప్రకారం బాస్ లెడీ నమ్రతే ప్లాన్ చేస్తారు. అటు మహేశ్ బాబు షూటింగ్‌కు, ఇటు పిల్లల స్కూళ్లకు ఇబ్బంది లేకుండా చక్కటి ప్లానింగ్‌తో వెకేషన్స్ ప్లాన్ చేస్తూ తన కుటుంబాన్ని ఎంతో స్పెషల్‌గా ఉంచుతుంటారు నమ్రత. అలాగే ఇండస్ట్రీలోని పలువురు స్నేహితులతో కలిసి ఫ్యామిలీ పార్టీలు చేసుకుంటూ సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యేలా వ్యవహరించడంలోనూ నమ్రత కీలకంగా వ్యవహరిస్తారు. నమ్రత ప్రోత్సాహంతో సితార పాప యూట్యూబ్ చానెల్ ప్రారంభించి తనకంటూ సొంతంగా క్రేజ్ సంపాదించుకుంటోన్న విషయం తెలిసిందే. మంచి తల్లిగా, మంచి భార్యగా, అలాగే మంచి కోడలిగా, ఇక తెలివైన వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్న నమ్రత.. ఎల్లప్పుడూ ఎంతో ధైర్యంగా, సంపూర్ణ ఆరోగ్యంతో అలాగే సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సంతోషం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.