ఆర్ఆర్ఆర్.. రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడ్డ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ తాజాగా రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్‌పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రేమికులకు చిత్ర యూనిట్ తాజాగా శుభవార్త చెప్పింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతా బాగుంటే మార్చి 18 లేకపోతే ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామని పేర్కొంది.

ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా.. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించారు.