ఆగిన అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ రిలీజ్

‘పుష్ప ది రైజ్’ హిందీ లో అద్భుతమైన విజయం సాధించడంతో, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను కూడా హిందీ వర్షన్ ను థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనతో గోల్డ్‌మైన్స్‌ సంస్తకు చెందిన మనీష్ షా ప్లాన్ చేశారు. ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ హక్కులు మనీష్ షా సొంతం చేసుకున్నారు. పుష్ప క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి జనవరి 26, 2022న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇది అనైతికమని ముందు నుంచి వాదిస్తున్నారు ఎందుకంటే ఈ చిత్రం ప్రస్తుతం హిందీలో ‘షెహజాదా’గా రీమేక్ చేయబడుతోంది, అల్లు అర్జున్ పాత్రను కార్తీక్ ఆర్యన్ పోషించాడు. ఈ బాలీవుడ్ రీమేక్‌కి అల్లు అరవింద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తే, హిందీ రీమేక్‌కు అవకాశం ఉండదు. కాబట్టి, ‘షెహజాదా’ నిర్మాతలు రంగంలోకి దిగి మనీష్ షాతో చర్చలు జరిపి ఆ నిర్ణయాన్ని వదులుకునేలా చేశారు. “అల వైకుంఠపురములో హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదలను ఉపసంహరించుకోవాలని గోల్డ్ మైన్స్ ప్రమోటర్ మనీష్ షా, షెహజాదా నిర్మాతలు సంయుక్తంగా నిర్ణయించుకున్నారు. దీనికి అంగీకరించినందుకు మనీష్ షాకు షెహజాదా మేకర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు” అని ఒక ప్రకటన విడుదలైంది.