ఖమ్మం జిల్లాలో తారకరాముడి విగ్రహం

నవరస నటసార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు ఖమ్మం జిల్లాలో దర్శనం ఇవ్వనున్నారు. నగరంలోని లాకారం టాక్ బండ్‌పై 54 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో సుమారు రూ.2. 3 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే కళాకారుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. మాయాబజార్ , శ్రీకృష్ణ తులభారంలో కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కనిపిస్తారో అచ్చం అదే రూపంలో భారీ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా భారీ ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాతగారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోప్ బ్రిడ్జి ఏర్పాటుతో ఖమ్మం సిగలో మణిహారంగా మారిన లాకారం ట్యాక్ బండ్ ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో మరింత ఆకర్షణీయంగా, శోభాయమానంగా మారనుంది. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో ఎలాంటి రాజకీయాలు లేవని, నటుడిగా ఆయనపై ఉన్న అభిమానంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.