పెళ్లి రోజున శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ దంపతులు

హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు తిరుమలలో సందడి చేశారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీకాంత్ తన భార్య ఊహ, కుమారుడు రోషన్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీకాంత్ హీరోగా ఫామ్‌లో ఉన్న టైమ్‌లో హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి రోషన్, మేధ, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో నటుడిగా మారాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజిలెస్‌లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ప్రైవేటుగా బి.బి.ఎం చదువుతున్నాడు. కూతురు మేధ బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్ 14 తరపున జాతీయ జట్టులో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక శ్రీకాంత్ విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కెరీర్ బిగినింగ్‌లో విలన్‌గా నటించిన శ్రీకాంత్ తర్వాత హీరోగా ఎదిగారు. లవ్, ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ తో ఓ స్థాయి హీరోగా ఎదిగారు. దాదాపు రెండు దశాబ్దాలు శ్రీకాంత్ హీరోగా కొనసాగారు. హీరోగా ఆయన ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా విలన్‌గా మారి సక్సెస్ అందుకుంటున్నారు. యుద్ధం శరణం మూవీతో విలన్ గా మారిన శ్రీకాంత్ ఇటీవల విడుదలైన అఖండ చిత్రంలో విలన్ రోల్ చేశారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. అఖండ విలన్‌గా శ్రీకాంత్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మరోవైపు కొడుకు రోషన్‌ని హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో శ్రీకాంత్ ఉన్నారు. రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందDఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

శ్రీకాంత్-ఊహల పెళ్లి రోజు సందర్భంగా ఆయన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఈ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉంటూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నారు.