విశాల్ ‘సామాన్యుడు’ ట్రైలర్ రిలీజ్

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ ఎప్పుడూ విభిన్నమైన సినిమాలతో అలరిస్తుంటారు. విశాల్‌ హీరోగానే కాకుండా నిర్మాతగా పలు మంచి సినిమాలను తెరకెక్కించారు. తాజాగా విశాల్‌ కథానాయకుడిగా రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రం సామాన్యుడు. ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. విశాల్‌ తన సొంత బ్యానర్‌ ‘విశాల్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ’పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తు. పా. శరవణన్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ప్రచార చిత్రాలు సామాన్యుడిపై అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్‌ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో రొమాంటిక్‌ అంశాలు ఉన్నప్పటికీ అంతకుమించి యాక్షన్ సీన్లు ఉన్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారని చెప్పడం, నేరస్థుడి పుట్టుక వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. అలాగే ఇతర సంభాషణలు హైలెట్‌ కానున్నాయి. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్లలో విశాల్‌ ఎప్పటిలానే అదరగొట్టారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సినిమాకు ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ యువన్‌ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. విశాల్‌ సరసన డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించింది. కవిన్‌ రాజా సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో యోగి బాబు, బాబురాజ్‌ జాకబ్‌, పీఏ తులసి, రవీనా రవి తదితరులు నటించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది.