హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో విలువైన దుస్తులు, కెమెరా కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేసే ధనుష్ పై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజుల క్రితం ధనుష్ అనే యువకుడు తమ ఇంట్లో పనికి కుదిరాడని, ఎప్పుడైతే దుస్తులు, కెమెరా చోరీ అయ్యాయో అప్పటినుంచి అతను కనిపించడం లేదని తెలిపింది. వాటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని, అందుకే ధనుష్ పై తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇక నిక్కీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ధనుష్ కోసం రెండు రోజులు గాలించి తాజాగా అతడి స్నేహితుడి ఇంట్లో పట్టుకున్నారు. ధనుష్ ని తమదైన రీతిలో విచారించగా.. తానే ఆ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ దుస్తులను, కెమెరాను స్నేహితుడి ఇంట్లో దాచానని చెప్పగా.. పోలీసులు వాటిని వెతికి, నిక్కీకి అప్పగించారు. దీంతో నిక్కీ వెంటనే అతనిపై కేసును విరమించుకున్నట్లు తెలుస్తోంది. కఠిన శిక్షలేమి వద్దని కోరుతూ అతడిని విడిపెట్టమని కోరినట్లు సమాచారం. నిక్కీ గల్రానీ తెలుగులోనూ సుపరిచితురాలే.. ఆది పినిశెట్టి నటించిన ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాలలో నటించి మెప్పించింది. మరుముఖ్యంగా ఆమె నటి సంజన గల్రానీ చెల్లెలు అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తుంది.