వరుణ్‌తేజ్‌కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బుధవారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా వరుణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, సుప్రీం హీరో సాయితేజ్, నితిన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, అలాగే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ, ఎఫ్3 మూవీ టీమ్, గని మూవీ టీమ్ వరుణ్ తేజ్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెగాస్టార్ కుమార్తె కూతురు శ్రీజ.. తన సోదరుడికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్‌గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది’’అంటూ వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు శ్రీజ. ప్రస్తుతం శ్రీజ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వరుణ్ బర్త్ డే సందర్భంగా ఇంకా ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు.