‘హీరో’ సినిమాలో జోకర్ పార్ట్‌కి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు: అశోక్ గల్లా

9 3

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా క‌థానాయ‌కుడిగా పరిచయమ‌వుతున్న చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్‌. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మీడియాతో ముచ్చటించారు. గల్లా అశోక్ మాట్లాడుతూ..‘‘కమర్షియల్ సినిమాను చేస్తున్నామని డైరెక్టర్ ముందే చెప్పారు. ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు. సెట్‌లో దర్శకుడు ఏది చెబితే అది చేశాను. ఆయన ఓకే అన్నారా? లేదా? అని మాత్రమే చూశాను. అంత కంటే ఎక్కువగా నేను ఆలోచించలేదు. కథ గురించి ఇప్పుడే నేను ఎక్కువగా చెప్పలేను కాని ట్విస్ట్‌లోనే ఈ సినిమా టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. రేపు రిలీజ‌య్యాక‌ ఈ సినిమాకు హీరో టైటిల్ పర్ఫెక్ట్ అని అంతా అంటారు. నేను శ్రీరామ్ ఆదిత్య గారిని దర్శకుడిగా ఎంచుకోలేదు. మేం ఇద్దరం ఒకరినొకరు ఎంచుకున్నాం. ఇద్దరం కలిసి సినిమాను చేయాలని అనుకున్నాం. ఆయన నన్ను హీరోగా ఎంచుకోవడం నా అదృష్టం. నన్ను చూశారు.. అబ్బాయి నచ్చాడు అని చెప్పారు. ఏ సినిమాలు ఇష్టమని అడిగారు. అలా ఓ ఆరు గంటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరకు సినిమా చేసేద్దామని అన్నారు. శ్రీరామ్ ఆదిత్య గారి సినిమాలు, ఆయన తెరకెక్కించే విధానం అన్నీ బాగుంటాయి. ఆయనేంటో నాకు తెలుసు. స్టోరీ నచ్చింది, మేం కనెక్ట్ అయ్యాక నేనేం ఆలోచించలేదు. అంతా ఆయనే చూసుకుంటాడని అనుకున్నాను. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. హీరో అవ్వాలని అనుకుంటాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనమే తోపు అని అనుకునే కారెక్టర్. నేను ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నా డెబ్యూ మూవీ అని మాత్రమే చూశాను. తాత‌య్య కృష్ణ, మహేష్ బాబు గారి లెగసీని కంటిన్యూ చేద్దామనే. డ్యాన్స్, యాక్షన్‌లోట్రైనింగ్ తీసుకున్నాను. నాకు మామూలుగా అయితే యాక్టింగ్ అంటేనే ఇష్టం. నేనేమీ నాచురల్ డ్యాన్సర్‌ని కాదు. జిమ్‌కు వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. కానీ నాకున్న లెగసీ కోసమే ఇవన్నీ నేర్చుకున్నాను. కాలేజ్‌లో నాకు ఫిల్మ్ డిగ్రీ ఉంది. నాకు ఏడు ఎనిమిదేళ్లున్న సమయంలోనే తాతగారు ఓ సినిమాలో పెట్టారు. నాని సినిమాలో కూడా నటించాను. అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తుంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి బ్యాట్ మాన్ అంటే ఇష్టం. జోకర్ తెలీకుండా ఉంటుందా?. సినిమాలో జోకర్ పార్ట్ కొద్దిగా చేశారు. కానీ దానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. నాకు నటనపై ఆసక్తి ఉందని మహేష్ బాబు గారికి ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాను. కానీ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాని తెలియడంతో సీరియస్‌గానే చెప్పాడని అనుకున్నారు. ఇక్కడకు వస్తే ఎలా ఉండాలి.. ఎలా ధైర్యంగా ఉండాలి అనేదే ఎక్కువగా చెప్పారు. దర్శకుడు ఈ సినిమాకు కమర్షియల్ ఫార్మాట్ అద్దారు. కానీ ఇందులో కాన్సెప్ట్ ఉంటుంది. సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. సంక్రాంతికి రావాలని చివరి నిమిషంలో నిర్ణయించుకున్నాం. జనవరి 15న హీరో సినిమాను థియేటర్లో అందరూ చూడండి.’’ అన్నారు.