బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని నష్టం: చిరంజీవి

4 7

తమిళనాడులో జరిగిన సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో రావత్‌తో పాటు ఆయన సతీమణి కూడా మరణించారు. మొత్తం 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ అధికారికంగా తెలియజేసింది. దీంతో పలువురు ప్రముఖులు.. ఇది భారతదేశానికి తీరని నష్టం అని ప్రకటిస్తూ.. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తున్నారు. బిపిన్ రావత్ మరణ వార్త విని తన హృదయం బద్దలైందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై.. గొప్ప ప్రతిభాపాటవాలు గల మన సైనికాధికారి, మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు మరో 11 మంది చనిపోయారనే షాకింగ్ విషయం తెలిసి నా హృదయం బద్దలైంది. ఇది మన దేశానికి తీరని నష్టం. మృతుల కుటుంబాలకు నా సంఘీభావం తెలియజేస్తున్నాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం.