కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్ పెళ్లిపై కంగన స్పందన

7 7

బాలీవుడ్‌ నటీనటులు కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. రాజ్‌స్థాన్‌లోని సిక్స్‌ సెన్సెన్స్ ఫోర్ట్‌లో వీరి వివాహ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వీరి వివాహంపై తాజాగా నటి కంగనా రనౌత్‌ స్పందించారు. ఈ జంటపై పరోక్షంగా పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘సమాజంలో ఎంతోమంది ధనవంతులైన పురుషులు తమకంటే వయసులో చిన్నవారినే పెళ్లి చేసుకుంటారు.. భర్త కంటే భార్యకు పేరు, పలుకుబడి ఎక్కువగా ఉంటే ఆ వివాహబంధంలో కలతలు వస్తాయి.. ఇలాంటి ఎన్నో నిబంధనలు గురించి వింటూ నేను పెరిగాను. ఇప్పుడు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సక్సెస్‌, ధనవంతులైన నటీమణులు ఆ నిబంధనలకు స్వస్తి పలుకుతూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం నాకెంతో ఆనందంగా ఉంది’’ అని కంగన తెలిపారు. ఇక, విక్కీ-కౌశల్‌ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీల్లో ఈ జంట ప్రత్యేకార్షణగా నిలిచింది. వీరి పెళ్లి వార్తతో బీటౌన్‌లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ రాజ్‌స్థాన్‌కి పయనమవుతున్నారు. ఇక వయసు పరంగా చూసుకుంటే కత్రినా కంటే విక్కీ ఐదేళ్లు చిన్నవాడు కావడం విశేషం.