దుర్గమ్మ క్రేజ్ పెంచిన భీమ్లా నాయక్ !

bheemla nayak

పవర్‌ స్టార్‌ పవన్‌ కల‍్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ సినిమాకు సాగర్‌ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు. ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్‌ కూడా విడుదలైంది. ‘అడవి తల్లి’ అనే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్ట్‌ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు… ’అంటూ సాగా ఈ ‘అడవి తల్లి మాట’పాటకు రామజోగయ్యశాస్త్రీ లిరిక్స్‌ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో ఈ పాట పాడిన సింగర్‌ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్‌. కుమ్మరి దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని నెటిజన్స్‌ ఆరా తీస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ, భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. దుర్గవ్వకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్‌ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె శైలజ తల్లితో పాటలు పాడిస్తూ యూట్యూబ్‌ అప్‌లోడ్‌ చేసేది. ఇలా దుర్గవ్వ పాడిన పాటలు హిట్‌ కావడంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ ఆల్బమ్‌లలో పాటలు పాడించారు. ఆ పాటలు కూడా పాపులర్‌ కావడంతో మల్లిక్‌తేజ, మామిడి మౌనిక వంటి జానపద కళాకారులు దుర్గవ్వ కళను గుర్తించి అవకాశం ఇచ్చారు. మామిడి మౌనిక, సింగర్‌ మల్లిక్‌తేజ సహకారంతో టాలీవుడ్‌ స్టార్‌హీరో సినిమాలో పాడే అవకాశం వచ్చిందని దుర్గవ్వ కుమార్తె శైలజ తెలిపారు.