20 కిలోల బరువు తగ్గిన హీరోయిన్!

ఖుష్బూ అనే పేరు వినగానే బొద్దుగా ఉండే ఒక నిండైన రూపమే గుర్తుకొస్తుంది. కానీ గతేడాది లాక్‌డౌన్ పుణ్యమా అని ఏకంగా మూడు నెలల్లోనే 15 కిలోలు తగ్గిపోయి షాకింగ్ లుక్‌లోకి మారిపోయిన ఈ సీనియర్ హీరోయిన్ ఆ తర్వాత కూడా బరుతు తగ్గుతూనే ఉంది. తాను 20 కిలోల బరువు తగ్గినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఖుష్బూ. అక్కడ్నుంచి ఇక్కడికి అంటూ తన రెండు ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఖుష్బూ. లావుగా ఉన్న ఫోటోతో పాటు ఇప్పుడు బరువు తగ్గిన ఫోటోలను ట్వీట్ చేసింది. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. ఇప్పుడు తన లుక్ చూసి ఏదో అయిపోయిందని అంతా కంగారు పడుతున్నారని.. అలాంటి వాళ్లకు ఒక్కటే సమాధానం చెప్తున్నానని తెలిపింది ఖుష్బూ. తాను చాలా ఆరోగ్యంగా.. అందంగా మారిపోయానని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని చెప్పుకొచ్చింది. అయితే తనకు ఎదో అయిందని బాధ పడిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె తనను చూసి మరో 10 మంది బరువు తగ్గి ఫిట్‌గా ఉంటే అదే తన విజయం అని చెప్పుకొచ్చింది. కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరమై ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో లక్ పరీక్షించుకునే పనిలో బిజీగా ఉంది. అలాగే అడపదడపా సినిమాల్లో నటిస్తుంది కూడా. చివరిగా ఆమె రజినీకాంత్ హీరోగా శివ తెరకెక్కించిన అన్నాత్తే సినిమాలో నటించింది.