స్కైలాబ్ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష త‌దిత‌రులు
సాంకేతిక బృందం: సంగీతం: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి, ఛాయాగ్ర‌హ‌ణం: ఆదిత్య జవ్వాది, కూర్పు:  రవితేజ గిరిజాల, ప్రొడక్షన్‌ డిజైన్‌:  శివం రావ్‌, సౌండ్ రికార్డిస్ట్‌‌:  నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌, కాస్ట్యూమ్స్‌: పూజిత తాడికొండ,

సహ నిర్మాత: నిత్యామీనన్‌,

నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు,

మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు

12

స‌త్య‌దేవ్ ఓ క్యారెక్ట‌ర్ చేశాడంటే… హీరోగా సినిమా చేశాడంటే… సమ్‌థింగ్ స్పెష‌ల్ ఉంటుంద‌నే పేరు వ‌చ్చింది. హిట్టూ ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే, నిత్యా మీన‌న్‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లిద్ద‌రూ జంట‌గా కాకుండా… ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా స్కైలాబ్‌. రాహుల్ రామ‌కృష్ణ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. సినిమాలో న‌టించ‌డంతో పాటు స‌హ నిర్మాత‌గా వ్య‌వహ‌రించారు నిత్యా మీన‌న్. ఇక నాసా పంపించిన స్కైలాబ్ భూమిపై పడటం అనేది కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన భయాందోళనతో కూడిన ఓ సంఘటన. ఈ విషయంపై సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లుకు ఓ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అందులోనూ ముఖ్యంగా ట్రైలర్ చాలా బాగుండడంతో ఏదో కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా చూడబోతున్నాం అని అనిపించింది. ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం…

కథ ఏంటంటే..
ఆనంద్ (స‌త్య‌దేవ్‌) వైద్యం చ‌దువుకున్న యువ‌కుడు. త‌న తాత‌గారి ఊరైన బండ లింగంప‌ల్లికి వ‌స్తాడు. ఆ ఊరికి చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామ‌కృష్ణ‌)తో ప‌రిచ‌యం పెంచుకుని క్లినిక్ ప్రారంభించే ప‌నిలో ఉంటాడు. సుబేదార్ రామారావుది మ‌రో క‌థ‌. ఒక‌ప్పుడు బాగా బ‌తికిన త‌న కుటుంబాన్ని క‌ష్టాల్లో నుంచి గ‌ట్టెక్కించ‌డం కోసం పోరాటం చేస్తుంటాడు. ఇద్ద‌రూ క్లినిక్ ప్రారంభిస్తారో లేదో ఆ వెంట‌నే ఊళ్లో స్కైలాబ్ ప‌డుతుందనే భ‌యాలు మొద‌ల‌వుతాయి. దాంతో వాళ్లిద్ద‌రి క‌థ మొద‌టికే వ‌స్తుంది. ఆ ఊరి దొర‌బిడ్డే గౌరి (నిత్య‌మేన‌న్‌)ది ఇంకో క‌థ‌. ఆమె పాత్రికేయురాలిగా రాణించే ప్ర‌య‌త్నంలో ఉంటుంది. ఆ ఉద్యోగం లేక‌పోతే త‌న తండ్రి పెళ్లి చేసేస్తాడేమో అనే భ‌యం ఆమెది. ప‌ట్నం నుంచి ఊరికి వ‌చ్చిన గౌరి అక్క‌డి నుంచే వార్త‌లు రాయ‌డం మొద‌లు పెడుతుంది. కానీ ప‌త్రిక‌లో మాత్రం ప్ర‌చుర‌ణ కావు. మ‌రి ఆమె రాసిన క‌థ‌లు ఎప్పుడు ప్ర‌చుర‌ణ‌కి నోచుకున్నాయి? ఆనంద్ క్లినిక్ పెట్టాడా? రామారావు క‌ష్టాలు తీరాయా? స్కైలాబ్ భ‌యాలు ఆ ఊరిపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్కైలాబ్ గురించి చెప్పాలంటే.. ‘‘1979లో అమెరికా స్పేస్‌ స్టేషన్‌ నాసా ప్రయోగించిన స్పేస్‌ స్టేషన్‌ స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. 1979 జూలై 11 న సముద్రంలో పడి విచ్ఛిన్నం అయిన ఆ శకలం ప్రజలను మూడు వారాలపాటు భయపెట్టింది. దాంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలామంది మేకలు, గొర్లు, కోళ్లు కోసుకుని వండుకుని తిన్నారు. ఆస్తులు ఎక్కువగా ఉన్నవారు తక్కువ ధరకే అమ్ముకోగా, కొంతమంది తమ జీవితాలు ముగియబోతున్నాయని స్థిరాస్తులను దానం చేశారు. కొందరైతే స్కైలాబ్ ప్రభావం పడకుండా ఉండేందుకు కొన్ని రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు.పేడను ఇంటి తలుపులకు పూసి గ్యాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కైలాబ్ తమ గ్రామాల సమీపంలో పడినా.. దాని ద్వారా వచ్చే విషవాయువులు ఇళ్లలోకి చొరబడవద్దని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు స్కైలాబ్ పడుతుందన్న రోజు రాగానే గ్రామగ్రామాన దండోరా వేయించి ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రచారం చేశారు. మరునాడు బతికుంటామో లేదా అన్న ఆందోళనతోనే ఎవరి ఇళ్లలో వారు తెల్లవార్లూ నిద్రపోకుండా ఉండిపోయారు. ఇంకా రకరకాల వింతలు, భయాలతో చోటు చేసుకున్నాయి.

ఇక సినిమా ఎలా ఉందంటే… ఇది ‘స్కైలాబ్’ కథ కాదు… ఓ ముగ్గురి మనుషుల కథ, ఓ ఊరిలోని అమాయకపు ప్రజల కథ. ‘స్కైలాబ్’ అనేది ఈ సినిమాకు షుగర్ కోటెడ్ పిల్ లాంటిది. స్కైలాబ్ లోపల ఉన్నది మన మనుషుల కథే. మన మట్టి కథ. మనుషుల్లో అవకాశవాదులు, ఊహా ప్రపంచంలో బతికేవాళ్లు, ఏదో జరుగుతోందని భయపడేవాళ్లు, అమాయకులు… సినిమాలో అందరూ ఉన్నారు. వాళ్లలో వచ్చే మార్పు ఉంది. అప్పట్లో మనుషుల మధ్య వివక్షను గొడవల రూపంలో కాకుండా కొత్త కోణంలో చూపించింది. మంచి కథ ఉంది. అయితే… పువ్వులు అన్ని దండగా మారాలంటే ఓ‌‌ దారం కావాలి. దండ అందంగా కనిపించాలంటే పువ్వులన్ని దూరం దూరంగా కాకుండా దగ్గరగా కనిపించాలి. ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. సన్నివేశాలు బావున్నా… కథను క్లుప్తంగా చెప్పడంలో దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. విశ్వక్ ఖండేరావు రాసుకున్న కథలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అయితే… ఫస్టాప్ లో ఎంత సేపటికీ కథ ముందుకు కదలదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సాగింది. మధ్య మధ్యలో నిత్యా మీనన్ సీన్స్ కొన్ని నవ్వించాయి. సెకండాఫ్ లో, అదీ పతాక సన్నివేశాలు వచ్చేసరికి కథ ముందుకు కదిలింది. క్లైమాక్స్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. అయితే… అప్పటి వరకూ నత్త నడకన సాగిన సినిమాను చూడటం ప్రేక్షకులకు కొంచెం కష్టమే. సినిమా అంత స్లోగా సాగింది. ఎడిటింగ్ తప్పిస్తే… సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీకి పేరు పెట్టడానికి లేదు. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్స్ మంచి అవుట్ పుట్ ఇచ్చాయి. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం పర్వాలేదనిపించినా, అక్కడక్కడ మరీ చికాకు తెప్పించినట్లు అనిపిస్తుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి.

ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… చాలా రోజుల తర్వాత నిత్యా మీనన్ ని డైరక్ట్ తెలుగు సినిమాలో చూస్తున్నాం. ఆమె నమ్మి, ఇష్టపడి,పెట్టుబడి పెట్టి మరీ చేసిన పాత్ర…లిటరల్ గా అదరకొట్టింది. పాత్ర కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకోవడం విశేషం. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ నటులుగా ఎప్పుడో నిరూపించుకున్నారు. వాళ్లకు పెద్దగా సవాల్ విసిరే పాత్రలు కాకపోవడంతో సులభంగా చేసుకుంటూ వెళ్లారు. తనికెళ్ల భరణి, తులసి అనుభవం వాళ్లు పోషించిన పాత్రల్లో కనిపించింది. మిగతా పాత్రధారులు పర్వాలేదు. నిత్యా మీనన్ ఇంట్లో పనిచేసే కుర్రాడి పాత్రలో విష్ణు బాగా నటించాడు.

రేటింగ్ 2/5