‘అఖండ’ మూవీ రివ్యూ

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వల్, పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు, అయ్యప్ప.పి.శర్మ, సుబ్బరాజు, అవినాశ్, నాగమహేశ్, శ్రావణ్, కాలకేయ ప్రభాకర్, సమ్మెట గాంధి, చమ్మక్ చంద్ర, దువ్వాసి మోహన్ తదితరులు

సంగీతం : యస్.యస్.తమన్

మాటలు : యం.రత్నం

యాక్షన్ : స్టంట్ శివ, రామ్ లక్ష్మణ్

నిర్మాణం : ద్వారకా క్రియేషన్స్

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి

1 1

‘సింహా’, ‘లెజెండ్’ వంటి రెండు సక్సెస్ సినిమాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. బాలయ్య తొలిసారి అఘోరా పాత్రలో కనిపిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘అఖండ’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ ఏంటంటే… అనంతపురం జిల్లాకు చెందిన మురళీకృష్ణ(బాలకృష్ణ) ఓ రైతు. ఊరికి పెద్దగా ఉంటూ పేదవారికి అండగా ఉంటాడు. ఫ్యాక్షనిజం బాటపట్టిన యువతను దారి మళ్లీంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాడు. పేదవారి కోసం స్కూల్స్‌, ఆస్పత్రులు కట్టించి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ శరణ్య(ప్రగ్యా జైశ్వాల్‌) మురళీ కృష్ణ మంచితనం చూసి మనసు పడుతుంది. తన ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకుంటుంది. కట్‌ చేస్తే.. వరద రాజులు అనే మాఫియా లీడర్(శ్రీకాంత్‌) వరదా మైన్స్‌ పేరుతో మైనింగ్‌ మాఫియా నడుపుతుంటాడు. తను చేస్తున్న అక్రమాలకు అడ్డొస్తున్నవారిని దారుణంగా హతమారుస్తుంటాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తాడు. ఈ తవ్వకాల వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. విషయం తెలుసుకున్న మురళీకృష్ణ.. యూరేనియం తవ్వకాలను ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ వరదరాజులు తనకున్న పలుకుబడితో అతనిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిస్తాడు. ఈ క్రమంలో అఖండ(బాలకృష్ణ) ఎంట్రీ ఇచ్చి, మురళీకృష్ణ ఫ్యామిలీకి అండగా నిలుస్తాడు. అసలు అఖండ ఎవరు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటి? మైనింగ్‌ మాఫియా లీడర్‌ వరదరాజులు వెనుక ఉన్నదెవరు? మురళీకృష్ణ ఫ్యామిలీని అఖండ ఎలా కాపాడాడు? వరదరాజు ఆగడాలకు అఖండ ఎలా అడ్డుకట్ట వేశాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే: బాల‌కృష్ణ-బోయ‌పాటి కల‌యిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాల‌న్నీ ప‌క్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగానూ.. ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయ‌న రౌద్ర ప్రద‌ర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళ‌యాన్ని గుర్తు చేస్తే, మ‌రో పాత్ర ప్రకృతిలా అందంగా తెర‌పై క‌నిపిస్తుంది. కథానాయ‌కుడి ప‌రిచ‌య స‌న్నివేశాలు మొదలుకొని చివ‌రి వ‌ర‌కు ప్రతీ స‌న్నివేశం కూడా బాల‌కృష్ణ మాస్ ఇమేజ్, బోయ‌పాటి మార్క్ థీమ్ మేర‌కు సాగుతుంది. అభిమానుల‌తో ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ముర‌ళీకృష్ణ – శ‌ర‌ణ్యల మ‌ధ్య ప్రేమాయ‌ణం, పీఠాధీశుడిని చంపి శ‌క్తి స్వరూపానంద స్వామిగా అవ‌త‌రించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజ‌ల మేలుని కోరే వ్యక్తిగా ముర‌ళీకృష్ణ పాత్రలో బాల‌కృష్ణ ఆక‌ట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయ‌న చెప్పే సంభాష‌ణ‌లు అల‌రిస్తాయి. జై బాల‌య్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాట‌లో బాల‌కృష్ణ – ప్రగ్యా జోడీ చూడ‌ముచ్చట‌గా క‌నిపిస్తుంది. ఒకే పాట‌లోనే నాయ‌కానాయిక‌ల‌కి పెళ్లి కావ‌డం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండని ప‌రిచ‌యం చేసిన తీరు బాగుంది. సెకెండాఫ్‌కు ముందు అఖండ పాత్ర ఆగ‌మ‌నం జ‌రుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు.. అఖండ పాత్ర ప్రవేశం త‌ర్వాత మ‌రో ఎత్తు. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వ‌చ్చిన ప్రతినాయ‌కుడిని అఖండ ఎలా అంతం చేశాడ‌నేది సెకెండాఫ్‌లో కీల‌కం. బాల‌కృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించ‌డం సినిమాకి ప్లస్సయ్యింది. అఖండ శివుడి అంశ‌తోనే పుట్టాడ‌నే సంకేతాలు క‌నిపిస్తాయి కాబ‌ట్టి ఆ పాత్రలో బాల‌కృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా న‌మ్మేలా ఉంటాయి. ఆయ‌న చెప్పే ప్రతీ సంభాష‌ణ ఓ పోరాటంలా, ప్రతీ పోరాటం ఓ క్లైమాక్స్ స‌న్నివేశాన్ని తల‌పించేలా ఉంటుంది. బాల‌కృష్ణని బోయ‌పాటి శ‌క్తిమంతంగా చూపిస్తార‌ని తెలుసు.. కానీ ఇందులో డోస్ మ‌రింత పెంచారు. ఇందులో క‌థ కంటే కూడా పాత్రల్ని మ‌లిచిన తీరే ఆక‌ట్టుకుంటుంది. దేవుడు, విజ్ఞానానికీ మ‌ధ్య సంబంధం గురించి, హిందుత్వం గురించి, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని.. శివుడు మామూలు మ‌నిషి కాదంటూ బాల‌కృష్ణ చెప్పే సంభాష‌ణ‌లు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాల‌యాలు, దేవుడు, ప్రకృతి త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో అక్కడ‌క్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేట‌ర్లకి ర‌ప్పించే ప‌క్కా పైసా వ‌సూల్ చిత్రమిది.

ఎవ‌రెవరు ఎలా చేశారంటే: బాల‌కృష్ణ వ‌న్ మేన్ షోలా రెండు పాత్రల్లోనూ విజృంభించి నటించారు. ఆయ‌న సంభాష‌ణ‌లు విన్నాక.. ఆయ‌న చేసే విన్యాసాలు చూశాక బాల‌కృష్ణ మాత్రమే చేయ‌గ‌ల క‌థ ఇద‌నిపిస్తుంది. జై బాల‌య్య పాట‌లో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అల‌రిస్తే, ఆయ‌న చేసిన పోరాటాలు మ‌రో స్థాయిలో ఉంటాయి. బాల‌కృష్ణ రెండు పాత్రల్లో విజృంభించిన‌ప్పటికీ.. ఇందులోని మిగ‌తా పాత్రల‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. క‌థానాయిక ప్రగ్యా జైస్వాల్‌తోపాటు పూర్ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌క‌మైన‌వే. ‘లెజెండ్‌’తో జ‌గ‌ప‌తిబాబుని ప్రతినాయ‌కుడిగా మార్చిన బోయ‌పాటి శ్రీను.. ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన మాఫియా లీడర్ పాత్రలో ఆయ‌న క‌నిపిస్తారు. బాల‌కృష్ణతో తొలిసారి ఎదురుప‌డే స‌న్నివేశం, అఘోరాతో త‌ల‌ప‌డే స‌న్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. శ‌క్తిస్వరూపానంద స్వామిగా క‌నిపించిన ప్రతినాయ‌కుడు కూడా త‌న‌దైన ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా త‌మ‌న్ సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం ఎలాంటిదో అర్థమ‌వుతుంది. జైబాల‌య్య‌, అఖండ, అడిగా అడిగా.. పాట‌లు బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, ఎం.ర‌త్నం మాట‌లు చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక ఎందుకు ప్రత్యేక‌మో ఈ సినిమా మ‌రోసారి స్పష్టం చేస్తుంది. మాస్ నాడి తెలిసిన బోయ‌పాటి త‌నదైన మార్క్‌ని ప్రద‌ర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బ‌లంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. ఎం.ర‌త్నం డైలాగ్స్‌ చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ బాగుంది. ద్వారకా క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

చివరిగా.. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషనలో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ‘అఖండ’

రేటింగ్ 2.75