‘అనుభవించు రాజా’ రివ్యూ

నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, ఆడుకళాం నరేన్, పోసాని కృష్ణమురళి, అజయ్, రవికృష్ణ, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియనా తదితరులు

సంగీతం: గోపీ సుందర్

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

సినిమాటోగ్రాఫర్: నగేశ్ బనేల్ 

నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్లెల్పీ  

కథ, స్ర్కీన్‌ప్లే , దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి

1 13

హుషారైన పాత్రల‌కి పెట్టింది పేరు రాజ్‌త‌రుణ్‌. ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపిస్తూ తెర‌పై సంద‌డి చేస్తుంటాడు. ‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో హ్యాట్రిక్ సాధించిన రాజ్ తరుణ్ కు ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మరే చిత్రమూ అందించలేకపోయింది. ఆరంభంలో మంచి విజ‌యాలే అందుకున్నా.. అతడి సినిమాలు ఇటీవ‌ల బాక్సాఫీస్‌ వద్ద అంత‌గా ప్రభావం చూపించ‌డం లేదు. త‌న శైలి పాత్రలో మ‌రోసారి క‌నిపిస్తూ ‘అనుభ‌వించు రాజా’ చేశారు. ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించేలా ఉండ‌టం, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఈ సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

కథేంటంటే…..: బంగారం అలియాస్ రాజు (రాజ్‌త‌రుణ్‌) పెద్దింట్లో పుట్టి పెరిగిన కుర్రాడు. అతని కుటుంబ సభ్యులు అంతా చిన్నతనంలోనే ఓ యాక్సిడెంట్ లో చనిపోతారు. కడుపు కట్టుకుని కోట్లు సంపాదించిన అతని తాతయ్య కన్నుమూస్తూ ఓ జీవిత సత్యాన్ని రాజుకు బోధిస్తాడు. ధనార్జనే జీవితం కాకుండా దానిని ఎంచక్కా అనుభవించమని సలహా ఇస్తాడు. దాని పర్యావసానం ఏమిటీ? ఈ కోనసీమ కుర్రాడు పల్లెను వదిలి హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డ్‌గా ఎందుకు పనిచేశాడు? ఊరికి ప్రెసిడెంట్ కావాల‌నుకున్న రాజు ఎన్నిక‌ల హ‌డావుడిలో ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే…..: ప‌ల్లెటూరు.. అక్కడి కొన్ని కుటుంబాల‌తో ముడిప‌డిన క‌థ ఇది. కామెడీ, డ్రామాకి అవ‌కాశం ఉన్న క‌థ‌నే రాసుకున్నారు ద‌ర్శకుడు. ప్రథ‌మార్ధం హైద‌రాబాద్, ద్వితీయార్ధం ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగుతుంది. సెక్యూరిటీ గార్డ్‌గా కథానాయ‌కుడు ఉద్యోగంలో చేర‌డం, అక్కడ క‌థానాయిక‌తో ప‌రిచయం కావ‌డం, ఆ త‌ర్వాత ఇద్దరి మ‌ధ్య ప్రేమ పుట్టడం వంటి స‌న్నివేశాల‌తో సినిమాని స‌ర‌దాగా న‌డిపే ప్రయ‌త్నం చేశారు. కానీ, ఆ స‌న్నివేశాల్లో అంత బ‌లం లేక‌పోవ‌డంతో పెద్దగా వినోదం పండ‌లేదు. విరామ స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు క‌థ‌లో కీల‌క మ‌లుపుకి కార‌ణ‌మ‌వుతాయి. క‌థానాయకుడిలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ద్వితీయార్ధంలో ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉంద‌నే విష‌యాన్ని స్పష్టం చేస్తాయి. క‌థ ప‌ల్లెటూరికి వెళ్లాకైనా కామెడీ డోస్ పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడ కూడా నిరాశే. చూసేసిన కోడి పందేలు, ఒకే రకమైన సంద‌డి. కాక‌పోతే ఇక్కడ ప్రెసిడెంట్ కుటుంబంలోని డ్రామా, హ‌త్య వెన‌క ఎవ‌రున్నార‌నే విష‌యంపై రేకెత్తించిన ఆస‌క్తి ప్రేక్షకుల్ని క‌ట్టి ప‌డేస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. అక్కడ‌క్కడా న‌వ్వించే కొన్ని స‌న్నివేశాలు, హుషారుగా సాగే పాట‌లే చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను ఓ మాదిరిగా నిలబెట్టాయి.

ఆర్టిస్టు విషయానికి వస్తే.. రాజ్‌త‌రుణ్ బంగారం పాత్రలో ఓ జ‌ల్సారాయుడిలా చేసిన అల్లరి ఆక‌ట్టుకుంటుంది. ప్రథ‌మార్ధంలో సెక్యూరిటీ గార్డ్ రాజుగా, సుద‌ర్శన్‌తోనూ, క‌థానాయిక క‌శిష్‌ఖాన్‌తో క‌లిసి చేసిన సన్నివేశాలు కూడా స‌ర‌దాగా అనిపిస్తాయి. హీరోయిన్ కశిష్‌ ఖాన్ కు ఇదే ఫస్ట్ ఫిల్మ్. తెర మీద అందంగా కనిపించింది. ఇతర ప్రధాన పాత్రలను అజయ్, భూపాల్, సుదర్శన్, పోసాని, ‘ఆడుకాలం’ నవీన్, బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, అరియానా, ‘టెంపర్’ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు పోషించారు. జబర్దస్త్ ఆర్టిస్టులూ తెర మీద మెరుపులా మెరిశారు. సంభాషణలు ఆకట్టుకున్నాయి. భాస్కరభట్ల రవికుమార్ రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. గోపీసుందర్ స్వరాలు, నేపథ్యం సంగీతం బాగుంది. నగేశ్‌ బానెల్ సినిమాటోగ్రఫీ కనుల పండగలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు వంక పెట్టడానికి లేదు. జీవితాన్ని అనుభవించడం అంటే కేవలం తాను ఎంజాయ్ చేయడం కాదని, చుట్టుపక్కల ఉన్నవారిని సంతోషపెట్టాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ద‌ర్శకుడు శ్రీను గ‌విరెడ్డి ఇచ్చారు. అంత‌ర్లీనంగా ఊరి గురించి, జల్సాల గురించి, కుటుంబ బంధాల గురించి చెప్పిన సందేశం ఆక‌ట్టుకుంటుంది. మాట‌లు కూడా బాగున్నాయి. చివరిగా చెప్పాలంటే అనుభవించు రాజా ఫ్యామిలీతో కలిసి ఓసారి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 2.25/5