మర్యాద కృష్ణయ్యగా సునీల్

maryada krishnayya

స్టార్‌ కమెడియన్‌ సునీల్‌ హీరోగానూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. సునీల్‌ కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘మర్యాదరామన్న’. ఓ భయస్తుడు, దురదృష్టవంతుడైన ఓ యువకుడు ఫ్యాక్షన్‌ ప్రాంతానికి వెళితే, అక్కడ తను ఊహించని పాత పగలతో ప్రత్యర్థులు చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ యువకుడు తనకు ఎదురైన సమస్యను ఎలా అధిగమించాడనేదే ‘మర్యాదరామన్న’. అప్పుడు ‘మర్యాద రామన్న’గా మెప్పించిన సునీల్‌, ఇప్పుడు ‘మర్యాద కృష్ణయ్య’గా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం సునీల్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న కొత్త చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘మర్యాద కృష్ణయ్య’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే హీరో సునీల్‌ ఇందులోనూ ‘మర్యాద రామన్న’ తరహాలోనే భయస్థుడి పాత్రలో కనిపిస్తాడేమో అనిపించేలా ఉంది.