
‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో కలిసి శృతిహాసన్ నటిస్తోన్న హ్యాట్రిక్ సినిమా ‘వకీల్‌సాబ్’. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్రుతిహాసన్ తాజాగా ‘వకీల్‌సాబ్’ గురించి స్పందించారు. ‘‘కాటమరాయుడు’ తర్వాత పవన్ కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ‘వకీల్‌సాబ్’ చిత్రం ముఖ్యంగా మహిళల రక్షణ, వారి హక్కులకు సంబంధించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఇందులో చాలా చక్కగా చూపించారు. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కు యువతలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. మహిళ రక్షణ గురించి ఆయన చెబితేనే చాలా మంది స్ఫూర్తి పొందుతారు’’ అని శ్రుతిహాసన్ వివరించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని త్వరలో ఈ సినిమా నుంచి సరికొత్త పాట విడుదల కానుంది.